అమల అక్కినేని సినిమాల్లోకి రాకముందే ఫేమస్ డాన్సర్! ఆమె కథ ఇదే!!
on Jun 15, 2021
నటి అమలను అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం. తెలుగు చిత్రసీమలోని పెద్ద కుటుంబాల్లో ఒక క్రేజీ హీరో వేరే భాషకు చెందిన తారను పెళ్లాడటం అదే ప్రథమం కావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నాగార్జునకు అమల రెండో భార్య. అదివరకు ఆయన స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లాడి, అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. నాగార్జున నటుడు కావడం ఇష్టం లేనందువల్లే లక్ష్మి ఆయన నుంచి విడిపోయారనేది విరివిగా ప్రచారంలోకి వచ్చిన అంశం. అమలను 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు నాగార్జున. 1994లో వారికి అఖిల్ పుట్టాడు.
అసలు అమల ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఎక్కడ్నుంచి ఎలా సినిమాల్లోకి వచ్చారు? అనే విషయాలు ఆసక్తికరం. అమల హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు చిత్రం 'కిరాయిదాదా' (1987). ఆ సినిమా హీరో నాగార్జునే. అప్పటికే అమల పదిహేను దాకా తమిళ చిత్రాల్లో నటించారు. నిజానికి సినిమాల్లోకి రావాలనే ఆలోచన మొదట్లో ఆమెకు లేదు. ఆమె తల్లిదండ్రులకు కూడా లేదు. ఆమె తల్లి ఐరిష్ వనిత అయితే, తండ్రి బెంగాలీ బ్రాహ్మణుడు. ప్రఖ్యాత నాట్యకారుడు ఉదయ్ శంకర్ భార్య పేరు అమల. ఆ పేరే ఆమెకు పెట్టారు. బహుశా అందువల్లనేమో చిన్నవయసులోనే అమలకు నాట్యంపై అభిరుచి ఏర్పడింది.
ఒకవైపు నాట్యం, మరోవైపు చదువు కొనసాగేలా తల్లిదండ్రులు అమలను మద్రాసులోని 'కళాక్షేత్ర'లో చేర్పించారు. అక్కడ ప్రఖ్యాత నాట్యకారిణి రుక్మణీదేవి అరండేల్ శిష్యరికం, ఆమె ప్రేమాభిమానాలు లభించడం తనకు దక్కిన అదృష్టంగా అమల భావిస్తారు. కళాక్షేత్ర తరపున మనదేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ అమల బృందం భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. యూరప్ మినహా మిగతా పాశ్చాత్యదేశాల్లోనూ, చైనాలో కూడా ఆమె నాట్యప్రదర్శనలు ఇవ్వడం విశేషం. అలా చక్కని డాన్సర్‌గా ఆమెకు మంచి పేరు వచ్చింది.
ప్లస్ టూ చదువుతుండగా అమలకు తొలి సినిమా అవకాశం లభించింది. అప్పటికే డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుపొందిన టి. రాజేందర్ ఆమె నాట్య ప్రదర్శన చూసి, ఆ అవకాశం ఇచ్చారు. కానీ మొదట అమల ఒప్పుకోలేదు. కారణం, చదువు పూర్తిచెయ్యాలని. ఆ విషయం ఆమె చెప్పగానే, "అయితే పరీక్షల తర్వాతనే షూటింగ్ పెట్టుకుందాం" అన్నాడాయన. దాంతో సరేనన్నారు అమల. ఆమె పరీక్షలు రాయడం ఆలస్యం, షూటింగ్ మొదలైంది. ఆ సినిమా 'మైథిలి ఎన్ కాదలి' (తెలుగులో 'మైథిలీ నా ప్రేయసీ'). ఆ సినిమా హిట్టవడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో కమల్ హాసన్ జోడీగా చేసిన 'పుష్పక విమానం' (1987) మూవీ అమల కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాకు ఆమె ఫస్ట్ చాయిస్ కాదు. డైరెక్టర్ సింగీతం మొదట ఆ పాత్రకు శ్రీదేవినీ, తర్వాత హిందీ నటి నీలమ్‌ను అడిగారు. ఆ ఇద్దరికీ వరుసగా ఎక్కువ రోజులు కాల్షీట్లు ఇవ్వడానికి వీలవలేదు. దాంతో చివరకు అమలను అడిగారు. అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆ సినిమా స్క్రిప్టు గురించి అప్పటికే విని ఉండటంతో ఎలాగైనా దాన్ని చెయ్యాలని కాల్షీట్లు సర్దుబాటు చేశారు అమల. అందుకు తగ్గ అద్భుత ఫలితాన్ని ఆమె అందుకున్నారు. భారతీయ సినిమాల్లోని క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది 'పుష్పక విమానం'. ఆ తర్వాత ఆమె 'నాయకన్' హిందీ రీమేక్ 'దయావాన్' (1988)లో వినోద్ ఖన్నా కూతురి పాత్ర చేయడం ద్వారా హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టారు.
తెలుగులో 'శివ' చిత్రం చేస్తున్నప్పుడు నాగార్జునతో ఏర్పడిన సన్నిహితత్వం 'ప్రేమయుద్ధం', 'నిర్ణయం' సినిమాలు చేసేనాటికి బలమైన ప్రేమగా మారింది. ఆ తర్వాత 1992లో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె రాజశేఖర్‌తో 'ఆగ్రహం' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా 1993లో విడుదలైంది.
Also Read